ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం.. యూకే కార్లు, విస్కీపై సుంకం తగ్గింపు!


వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలకు ముందే రెండు దేశాలు వాణిజ్య చర్చలను ముగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా, యూకేలు తమ వివాదాస్పద అంశాలలో చాలా వరకు వైఖరిని తగ్గించుకున్నాయి. ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం ప్రకారం.. బ్రిటీష్ కార్లు, స్కాచ్ విస్కీపై సుంకాలను తగ్గించడానికి భారత్‌ అంగీకరించగా, భారతీయ నిపుణుల కోసం కొన్ని వీసా నిబంధనలను సడలించడానికి యూకే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు ప్రైవేట్‌గా జరుగుతున్నందున అధికారికంగా ప్రకటించలేదని భారత అధికారులు తెలిపారు. అయినప్పటికీ యూకేలో ఇమ్మిగ్రేషన్ రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో, వీసా సడలింపులు ఏవైనా పరిమితం చేయబడే అవకాశం ఉందని బ్రిటిష్ అధికారి ఒకరు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2030 నాటికి సుంకాలను తగ్గించే, మార్కెట్ యాక్సెస్‌ను పెంచే ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.రెండు ప్రభుత్వాలు వాణిజ్య చర్చలను సంవత్సరాంతానికి ముందే ముగించాలని భావిస్తున్నాయని భారత్, బ్రిటిష్ అధికారులు తెలిపారు.