ఇది చాలా ఇంకా కొంచెం కావాలా?

mahanaduమొదటి రోజు మహానాడు హడావుడి ముగిసింది. చాన్నాళ్ల తరువాత తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమం ఇది. అయితే తొలి రోజు కార్యక్రమాన్ని సమీక్షిస్తే, మరీ అంత గొప్ప సంబరం కానరాదనే చెప్పాలి. అయితే ఆ రోజు అజెండా మేరకు చూసుకుంటే సంతృప్తిగానే వుంటుంది. సాధారణంగా మహానాడులో చంద్రబాబు ఏం మాట్లాడతారన్నది కీలకం. అదే సమయంలో నేతల ఐక్యత ఏ మేరకు తొంగిచూస్తుందన్నది మరో సంగతి. కానీ గడచిన ఆరు నెలలుగా నిత్యం చంద్రబాబు మాట్లాడుతూనే వుండే పరిస్థతి. మహానాడు ముందు రోజు కూడా ఆయన విధానపరమైన వాఖ్యనాలు చేసారు. బిజెపితో అంటకాగమని, జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తామాని చెప్పేసారు. మరి ఇలాంటపుడు మహానాడులో కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? మళ్లీ చర్విత చరణమే. ఇక్కడే బాబు కాస్త కొత్తగా ఆలోచించాల్సింది. శ్రేణులను ఉత్సాహపర్చడానికి,  ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి ఏదైనా కొత్తగా చెప్పాల్సింది. కానీ అందుకు అవకాశం వున్నా, అంశాలు లేకుండా పోవడం వి చారకరం.

ఇక మహానాడులో మరో కొత్త విశేషం లోకేష్ రావడం. మినీ మహానాడుల్లో అధికారికంగా పాల్గొన్న లోకేష్ , ఈ మహానాడుతో రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లే. అయితే వీలయినంత హడావుడి లేకుండా చూడడంలో ఇటు పార్టీ, అటు బాబు ద్వయం జాగ్రత్తపడ్డారు. అది కాస్త మెచ్చుకోదగ్గ విషయం.

చిరకాలంగా ఎడమొహంగా వుంటూ  వస్తున్న హరికృష్ణ ఈ మహానాడులోనూ అదే తరహా ప్రదర్శించారు. అంటీముంట్టనట్లు, ముళ్లమీద వున్నట్లు వుండి, అంతలోనే మాయమయ్యారు. ఇది కార్యకర్తలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందన్నది కొత్తగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే బావా బామ్మర్థులకు పొసగని విషయం ఇప్పటికే జనాల్లోకి వెళ్లాల్సినంతా వెళ్లిపోయిందనే చెప్పాలి. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ జూనియర్ రాకపోవడం అన్నది కొంచెం మైనస్సే అని చెప్పాలి. ఇక్కడ బాబు కొంచెం పట్టు విడుపు ధోరణి ప్రదర్శించాల్సింది. ఎంతయినా పార్ఠీకి జూనియర్ ఇమేజ్ ప్లస్ అవుతుందన్నది వాస్తవం. పైగా పవన్ చంద్రబాబును కలిసినట్లు ఇటీవల ఫీలర్లు వచ్చాయి. అవి సహజంగా జూనియర్ అభిమానులను బాధిస్తాయి. అందువల్ల బాబు జూనియర్ ను స్వయంగా ఆహ్వనించి వుంటే ఆయన పట్ల గౌరవం పెరిగేది. ఇక రెండవ రోజయినా కార్యకర్తలకు ఉత్తాహాన్నిచ్చే విధంగా మహానాడు సాగుతందేమో చూడాలి మరి.