Site icon TeluguMirchi.com

కేంద్రం చేతిలో హైదరాబాద్..?

hyderabadహైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ’ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించి విషయం తెలిసిందే. అది కూడా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ మేరకు యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశాలలో ఏకగ్రీవ తీర్మాణాలు కూడా చేశారు. అనంతరం సీమాంధ్రలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ.. నిరసనలు వెలువెత్తాయి. సీమాంధ్రలో చెలరేగిన సమైక్య సెగలతో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ.. తదితర జాతీయ నాయకులు విగ్రాహాలు సైతం ధ్వంసమవుతున్నాయి. అయినను.. తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్, అటు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతి రోజు స్పష్టం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, చిరంజీవి వంటి సీమాంధ్ర నాయకులు ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిని గానీ, శాశ్వత కేంద్ర ప్రాలిత ప్రాంతం గానీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకు విభజన విషయంలో సీమాంధ్ర నేతల అసంతృప్తికి అసలు కారణం రాజధాని హైదరాబాద్ అనే విషయం అందరికి తెలిసిందే. పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పది సంవత్సరాలు హైదరాబాద్ ఏ రాష్ట్రం పరిధిలో ఉంటుంది. నగర శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి..? తదితర అంశాలు ప్రతి సామాన్య పౌరునికి వచ్చే సందేహాలు. ఆది నుంచి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా పేర్కొంటూ వస్తోన్న.. దిగ్విజయ్ ఆదివారం టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంపై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వచ్చే పది సంవత్సరాలపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికినీ.. అది తెలంగాణలో రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కు శాంతిభద్రతల అంశాన్ని మాత్రం ఢిల్లీ తరహాలో కేంద్రానికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అంటే.. ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రం కనుసనుల్లోనే మెలగనుందన్న మాట.

ఉమ్మడి రాజధాని సరే.. మరీ పదేళ్ల పాటు నగర ఆదాయం ఏ రాష్ట్రానికి చెందుతుంది అనే విషయాన్ని దిగ్గీరాజా స్పష్టం చేయలేదు. భాగ్యనగరంపై కేంద్రం పదేళ్లపాటు పెత్తనం సాగించనుందని దిగ్గీరాజా మాటలను బట్టి అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ఈలోపు సీమాంధ్రలో కొత్త రాజధానిని నిర్మించుకోవాలని కూడా ఆయన సూచించారు. మరీ పది సంవత్సరాల్లో కొత్త రాజధాని నిర్మాణం పూర్తి కాని యెడల పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారా..? మొత్తమ్మీద ఏదో ఓ కారణంతో హైదరాబాద్ నగరాన్ని కేంద్రం తన చేతిలో ఉంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇక భాగ్యనగరం భవితవ్యం హస్తిన హస్తంలో ఉండబోతుందన్నమాట!

Exit mobile version