హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వందేళ్ల రికార్డు ను బ్రేక్ చేసింది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ భారీ వర్షానికి నగరంలో పలు సంఘటనలతో 15 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు పడవలు సైతం రోడ్డెక్కాయి. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5:30 నుంచి అర్ధరాత్రి దాకా జోరుగా వాన పడింది. మధ్యాహ్నం 2:30 నుంచి ఉధృతి మరింత పెరిగింది. వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. భారీ వర్షానికి బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. కొన్నిచోట్ల రోడ్లపై నడుంలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, వరద తీవ్రత మధ్య వాహనదారులకు ఇళ్లకు చేరడం కష్టమైంది.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర వాయుగుండం కాకినాడ, తుని వద్ద తీరాన్ని తాకింది. ప్రధానంగా 17 జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాతవారణశాఖ అధికారులు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీచేశారు.