Site icon TeluguMirchi.com

ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైళ్లు..

దాదాపు ఐదున్న‌ర నెల‌ల త‌ర్వాత హైదరాబాద్ మెట్రో పరుగులు పెట్టింది. అన్‌లాక్‌4 ద‌శ‌లో భాగంగా నేటి నుంచి ఢిల్లీ, నోయిడా, ల‌క్నో, బెంగుళూరు, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో మెట్రో స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి. 169 రోజుల త‌ర్వాత ఢిల్లీ మెట్రో ప‌రుగులు తీసింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్ నుంచి మెట్రో స‌ర్వీసులు బంద్ అయ్యాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప‌లు న‌గ‌రాల్లోని మెట్రో స‌ర్వీసుల‌న్నీ ర‌ద్దు అయ్యాయి. అయితే అన్‌లాక్‌4 ద‌శ‌లో భాగంగా ఈరోజు నుండి మెట్రో రైళ్లు మళ్లీ పరుగులుపెడుతున్నాయి.

హైదరాబాద్ లో మొద‌టి విడుత‌లో భాగంగా ఇవాళ మియాపూర్‌-ఎల్బీన‌గ‌ర్ కారిడార్‌‌లో ప్ర‌యాణికుల‌కు మెట్రో రైళ్లు సేవ‌లు అందిస్తున్నాయి. ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు ప్ర‌యాణికులకు అందుబాటులో ఉంటాయి.

ద‌శ‌వారీగా మూడు కారిడార్ల‌లో మెట్రో సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఎల్బీన‌గ‌ర్‌-మియాపూర్ కారిడార్‌లో ప్రారంభ‌మ‌వ‌గా, రేపు నాగోల్ నుంచి రాయ‌దుర్గం వ‌ర‌కు, ఈ నెల 9 నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్‌లో స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్తాయి. కాగా, కంటోన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో స్టేష‌న్ల‌ను అధికారులు మూసివేశారు. గాంధీ ద‌వాఖాన‌, భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మూసాపేట, యూస‌ఫ్‌గూడా మెట్రో స్టేష‌న్ల‌ను మూసివేశారు.

Exit mobile version