హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం జోరుగా కురుస్తుంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం నుండి ఇంకా నగరం తేరుకోకముందే మరోసారి నగరంలో వర్షం పడుతుండడం తో GHMC అప్రమత్తం అయ్యింది. నగరంలోని అన్ని ఏరియాల్లో భారీ వర్షమే కురుస్తుంది.
ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం వరకు, అబ్దుల్లాపూర్‌మెట్-ఇనామ్‌గూడ హైవేపై, బీఎన్‌రెడ్డి నగర్, సాగర్ రింగ్‌రోడ్ వద్ద, మేడిపల్లి-ఉప్పల్ వరకు, హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసారంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారి మళ్లింపుతో రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ ప్రాంతంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
భారీ వర్షాలపై పోలీసుశాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంది. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యుత్ పోల్స్, వైర్లను ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దంది. వరదనీటిలోకి వెళ్లే సహసం చేయవద్దని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు కోరారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలు వీడాలంది. బైకులు, కార్లు వరదలో చిక్కుకుంటే ముందు వాటిని వదిలి ముందుకు బయటపడాలన్నారు.