హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం అందుకుంది. అన్ని ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుండడం తో రోడ్లు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వానల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలని లోకేశ్‌కుమార్ సూచించారు. అలాగే రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.