తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక జరిగే రోజు రానే వచ్చింది. శనివారం(అక్టోబర్ 30) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరగుతుంది.
మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.
ఉదయం 7 గంటల నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 262 పోలింగ్ బూత్ తన భార్య జమునతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు జరగనున్న పోలింగ్‌తో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తెల్చనున్నారు. ప్రతి ఓటరు విధిగా మాస్కును ధరించడంతోపాటు కొవిడ్ నిబంధనల్ని పాటించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.