పేద కుటుంబాలు కూడా ఆత్మగౌరవంతో మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్న ఇళ్లలో జీవించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు జాతీయ స్థాయిలో మరో సారి గుర్తింపు లభించింది. కొల్లూర్-2 లో నిర్మించిన రెండు పడక గదుల సముదాయానికి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హడ్కో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ జాయింట్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) మురళికృష్ణ చేతుల మీదుగా జిహెచ్ఎంసి హౌసింగ్ విభాగం ఓ.ఎస్.డి సురేష్ కుమార్ అందుకున్నారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని జిహెచ్ఎంసి కి అందజేశారు.