భారత వాయుసేన కోసం కొత్తగా 70 శిక్షణ విమానాలు


భారత వాయు సేన అవసరాల కోసం హెచ్‌టీటీ-40 రకానికి చెందిన 70 శిక్షణ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.6 వేల 828 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. ఆరేళ్ల వ్యవధిలో వీటిని సమకూర్చుకుంటామని చెప్పారు. ‘‘ప్రభుత్వరంగ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ ఈ విమానాలను ఉత్పత్తి చేస్తుంది. విమానాల తయారీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కొన్నివేల ఉద్యోగాలు కొత్తగా లభిస్తాయి. రక్షణ రంగంలో స్వావలంబనకు ఇదో పెద్ద ముందడుగు’’ అని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.