కోవిడ్–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో 11 దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా దేశాలతో భారత్ ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. ఆయా దేశాల్లో పూర్తిగా వ్యాక్సినేట్ అయిన పర్యాటకులు భారత్‌కు వచ్చిన తర్వాత హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన పని లేదని వివరించింది. కానీ, వారు ఆర్‌టీ–పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.