Site icon TeluguMirchi.com

చేవెళ్ళ చెల్లమ్మ రాజీనామా.. !

sabitaజగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ సోమవారం సాయంత్రం న్యాయస్థానానికి దాఖలు చేసిన అయిదవ ఛార్జిషీట్ లో సబితను ఏ4 నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో నిన్న రాత్రి హోం మంత్రి రాజీనామా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. సీఎం కిరణ్, పీసీసీ ఛీఫ్ బొత్స తదితరలు సబితను తొందరపడవద్దని సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేతలు నుండి కూడా హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హోం మంత్రి ఒక్క క్షణం కూడా మంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. కిరణ్ కేబినెట్ మొత్తం జైల్లుకెళ్లడం తప్పదని బాబు పేర్కొన్నారు. కాగా, నేత వి. హనుమంతరావు లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం సబిత రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె రాజీనామా చేయని పక్షం లో సీఎం కల్పించుకొని కేబినెట్ నుండి తొలగించాలని సూచించారు.

కాగా, తాజాగా హోం మంత్రి సబిత రాజీనామా చేయాలని అనుకుంటున్నారని మరో మంత్రి డి.కె.అరుణ చెప్పారు. సబితను ఆమె నివాసంలో కలుసుకున్న తర్వాత మంత్రి అరుణ మీడియాతో మాట్లాడుతూ… రాజీనామా విషయంలో తొందరపడవద్దని సూచించానని చెప్పారు. సబిత నిబంధనలకు అనుగుణంగానే జీవోలకు ఆమోదం తెలిపారని అరుణ సమర్థించారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ చెల్లెలు గా చెలామణి అయిన హోం మంత్రి సబితకు వైఎస్ చేసిన జీవోల కారణంగానే నిందుతురాలిగా పేర్కొనబడటం విశేషం.

జగన్ అక్రమాస్తుల కేసులో ఏ4 నిందితురాలిగా పేర్కొనబడిన చేవెళ్ల చెల్లమ్మకు కష్టాలు ప్రారంభమయ్యాయని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా చేయాలని ఇంటాబయట డిమాండ్ పెరుతుగుతున్న నేపథ్యంలో.. హోంమంత్రి సబిత రాజీనామా చేస్తారా !, లేదా మరి వేచిచూడాల్సిందే !

 

Exit mobile version