Site icon TeluguMirchi.com

ఇక అంతా అల్లకల్లోలమే!

apngosఒకవైపు తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం దూకుడును ప్రదర్శిస్తోంటే మరో వైపు సీమాంధ్రలో ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతోంది. దాదాపు అరవై రోజులకు పైగా జరుగుతున్న ఉద్యమం ఒకెత్తైతే కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ ఆమోదం పొందిన తరువాత జరుగుతున్న ఉద్యమం మరోఎత్తు. రోజురోజుకు ఉద్యమ స్వరూపం మారిపోతున్నట్లు కనిపిస్తోంది. సమైక్య హీరోలుగా నిలవడానికి రాజకీయ నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. కేబినెట్ నోట్ ఆమోదం తరువాత పీసీసీ చీఫ్ బొత్సను కుటుంబీకుల ఇళ్లపై దాడులు జరుగగా విజయనగరమంతా యుద్ధవాతావరణాన్ని తలపించింది. అంతేకాదు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రులు కూడా వెనక్కు తగ్గడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మరింత ఎగసిపడ్డాయి. దీంతో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు పెరిగాయి.

ఇదంతా ఒకెత్తయితే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో సీమాంధ్ర మొత్తం అంధకారమైపోయింది. అయితే విద్యుత్ సమ్మెను ప్రభుత్వమే వెనకుండి నడిపిస్తోందని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. కర్నూలులో ఉన్న 400కేవీ సబ్ స్టేషన్ లో ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు ఉద్యోగులను భయపెట్టి బలవంతంగా హ్యాండ్ ట్రిప్ చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు తెలంగాణకు చెందిన విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు కూడా విమర్శలు చేశారు. అయితే సదరన్ గ్రిడ్ ను ఫెయిల్యూర్ చేసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఒకవేళ గ్రిడ్ ఫెయిలయితే మొత్తం దక్షిణ భారత దేశమంతా అంధకారమయ్యే ప్రమాదం కూడా ఉంది.

విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించకపోతే అసాంఘీక శక్తులు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే విద్యుత్ సమస్యలతో పలు రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి.ఇక గ్రిడ్ ఫెయిల్యూరేగనక జరిగితే రాష్ట్రంలోని అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే గనక జరిగితే రాష్ట్రలో అసాంఘీక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికి ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గానీ,కేంద్ర ప్రభుత్వంగానీ దీనిపై చర్చించడానికి,చర్యలు చేపట్టడానికి ముందుకు రాకపోవడం దేనికి సంకేతం..? ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంక్షోబాన్ని తెర దించేందుకు చర్యలు చేపట్టకపోతే రాష్ట్రం అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది.

Exit mobile version