రాజ్యసభలో హరికృష్ణ గర్జన

harikrishna
రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సోమవారం నాడు రాజ్యసభలో హల్ చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై రాజ్యసభ చేపట్టిన చర్చలో ఆయన పాల్గొంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే అధ్యక్ష స్థానంలో వున్న డిప్యూటి చైర్మన్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసారు. తెలుగు లో మాట్లాడితే తనకు ఎలా అర్ధం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తనకే కాకుండా సంబంధిత మంత్రికి కూడా అర్ధం కాదని, హిందీ లో గాని, ఇంగ్లిష్ లో గాని మాట్లాడాలని అన్నారు. తాను తెలుగు వాడినని, తెలుగు లో మాత్రమే మాట్లాడతానని హరికృష్ణ ఖండితంగా చెప్పారు. ఈ దశలో బి జె పి నాయకుడు వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుంటూ సభ్యులు తమ మాతృభాషలో మాట్లాడవచ్చని, ఆ మేరకు రాజ్యసభ నిబంధనలు అంగీకరిస్తాయని చెప్పటంతో డిప్యూటి చైర్మన్ మిన్నకుండిపోయారు.

అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికే కాంగ్రెస్ అకస్మాత్తుగా విభజన అంశాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సమైక్య వివాహం చేస్తే, సోనియా గాంధి విభజన విడాకులు ఇచ్చారని హరికృష్ణ ఎద్దేవా చేశారు. ఒక దశలో హరికృష్ణ ఆవేశంతో ఊగిపోయారు. తోటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సి ఎం రమేష్ లు హరికృష్ణ ను శాంతింపచేశారు.