1982లో నందమూరి తారక రామారావు గారు టీడీపీని స్థాపించారు. ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ వాహనంపై ఏపీ అంతా కలియతిరిగారు. దాదాపు ఓ ఏడాది పాటు రాష్ట్రాన్ని చుట్టేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆ ఎన్నికల సమయంలో చైతన్యరథనికి రధసారధిగా హరికృష్ణ ఉన్నారు. 72వేల కిలోమీటర్ల ఆ యాత్రకు ఆయన సారథిగా వ్యవహరించారు. యాత్ర పూర్తయ్యేంత వరకు తండ్రినే వెన్నంటి ఉన్నారు.
ఎన్టీఆర్ మరణించిన తరువాత హరికృష్ణ “అన్నా తెలుగుదేశం” పార్టీని స్థాపించి చైతన్యరథంపై తన ఎన్నికల ప్రచారం చేశారు. అచ్చం ఎన్టీఆర్ లాగే కాకి చొక్కా, ప్యాంట్ వేసుకుని ప్రచారం చేశారు. అలాగే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అచ్చం తాతాగారి లాగనే చైతన్యరధంపై ఎన్నికలు ప్రచారం చేశారు. నందమూరి కుటుంబానికి చెందిన మూడు తరాలు చైతన్యరథంపై ప్రచారం చేశాయి.
హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే హరికృష్ణ పార్ధివదేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన అంతిమయాత్ర అదే చైతన్యరథంపై జరుగనుంది. ప్రస్తుతం చైతన్యరథం నాచారంలో ఉన్న రామకృష్ణ స్టూడియోలో ఈ వాహనం ఉంది.