Site icon TeluguMirchi.com

కేంద్ర మంత్రి వర్గంలోకి హరిబాబు

తెలుగు రాష్ట్రానికి చెందిన నేత, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య నాయుడు తాజాగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అయిన విషయం తెల్సిందే. దేశంలోనే రెండవ అత్యున్నత పదవిని దక్కించుకున్న వెంకయ్య వారసుడి ఎంపిక కార్యక్రమం ఆ పార్టీలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా కేంద్రంలో ఉండే ఆయన పదవి కోల్పోవడంతో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఇబ్బంది తప్పదని అంతా భావిస్తున్నారు. అయితే వెంకయ్య నాయుడు పదవిని తెలుగు రాష్ట్రాల వారికే అది కూడా ఏపీ వ్యక్తికే ఇవ్వాలనే నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇటీవలే పార్టీ అధినాయకత్వం ఈ విషయమై ఆయనతో సంప్రదింపులు జరపడం జరిగింది. ఏ సమయంలోనే రావాల్సి ఉంటుందని ముందే అధినాయకత్వం నుండి హరిబాబుకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేసి హరిబాబును మరియు మరో ఇద్దరిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని మోడీ అండ్‌ కో భావిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాడు అన్నా డీఎంకే పార్టీ నేతతో చర్చలు జరుగుతున్నాయి. పొత్తుకు ఓకే అంటూ రెండు లేదా మూడు మంత్రి పదవులు ఇవ్వాలని మోడీ నిర్ణయంగా తెలుస్తోంది. అతి త్వరలోనే వెంకయ్య ప్లేస్‌లో హరిబాబును చూస్తామని ఏపీ బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు.

Exit mobile version