Site icon TeluguMirchi.com

కుల, చేతి వృత్తిదార్ల నైపుణ్య శిక్షణకు అగ్ర ప్రాధాన్యం

handloom-workers
చేతి వృత్తిదార్లకు, కులవృత్తిదార్లకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఇందుకోసం ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన వెనుకబడిన తరగతుల శాఖ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమీక్షించారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 20 మంత్రిత్వ శాఖల సహకారంతో రూ.6,640,50 కోట్ల రూపొందించిన బిసి సబ్ ప్లాన్ పై మాట్లాడారు. బిసి సబ్ ప్లాన్ ద్వారా రాష్ట్రంలో 16 లక్షల 25 వేల 719 మంది లబ్దిపొందుతున్నారన్నారు. కులవృత్తులు, చేతివృత్తులు ఆర్ధికంగా ఒక స్థిరమైన ఆదాయవనరుగా రూపొందించేందుకు బిసి సంక్షేమశాఖ కృషి చేయాలని కోరారు. బిసిల్లో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ కులవృత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఆదేశించారు.

మంత్రిత్వ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాల వివరాలన్నీ ఆన్‌లైన్ లో వుంచాలని కోరారు. బిసి విద్యార్ధులలో ప్రతిభావంతులను గుర్తించి వారికి పోటీపరీక్షల్లో శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుల వృత్తులవారికి, చేతివృత్తులవారికి బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు సహకరించాలన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్య, విద్య తదితర శాఖలు బిసిల సంక్షేమానికి మంజూరు చేస్తున్న నిధులతో పథకాల అమలును బిసి సంక్షేమ శాఖ సమీక్షించాలని కోరారు. లబ్దిదార్ల వివరాలను ఆధార్ తో అనుసంధానించి, ప్రభుత్వ పథకాలతో గ్రామాల్లో ఎందరికి లబ్ది చేకూరిందో ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని తాజా కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. బిసి సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారుచేయటానికి మరో 10 రోజుల్లో సమీక్ష జరుపుతామని సీఎం చెప్పారు. బిసి హాస్టళ్లలో వెల్ఫేర్ ఆఫీసర్లు, సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునే అంశంపై సానుకూలంగా స్పందించారు. బిసి వెల్ఫేర్ హాస్టళ్లను క్రమంగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపటట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లా బిసి విద్యార్ధులకు కోసం 13 స్టడీ సర్కిళ్లు పనిచేస్తున్నాయన్నారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా 2015-16 విద్య సంవత్సరంలో 13 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. పోటీపరీక్షలకు, సివిల్ సర్వీసు పరీక్షలకు ఈ సెంటర్ల ద్వారా మెరుగైన శిక్షణ ఇచ్చి అణగారిన విద్యార్ధుల ప్రతిభను వెలికితీయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ కొల్లలు రవీంద్ర, సీఎంఓ సహాయకార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న,సంబంధిత విభాగాధిపతులు పాల్గొన్నారు.

Exit mobile version