ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వాస్తవానికి టెస్ట్ ల సంఖ్య పెంచడం వల్ల భారీ సంఖ్య లో కేసులు బయటపడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే..తాజాగా గుంటూరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ కరోనా వార్డ్ లో రెండు రోజులు ఉంచడం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే ..కొల్లిపరకు చెందిన ఓ మహిళ ఈనెల 12న స్వాబ్ పరీక్ష చేయించుకుంది. రెండు రోజుల తర్వాత గుండె నొప్పి రావడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ సిబ్బంది కరోనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఆమెను అనుమానిత లక్షణాలు ఉన్న వారు చికిత్స పొందుతున్న వార్డులో చేర్చారు. ఆ మహిళకు ఈ నెల 16న మరోసారి స్వాబ్ పరీక్ష చేయించారు. ఆ వెంటనే మహిళ కొల్లిపరలో ఇదివరకు చేయించుకున్న పరీక్షలో నెగిటివ్‌గా తేలింది. ఆమె మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన మెసేజ్‌ను ఆస్పత్రి సిబ్బందికి చూపించారు. అయినా సరే కోవిడ్ వార్డులోకి వెళ్లాల్సిందేనని చెప్పడంతో అక్కడే ఉంది. తర్వాత రెండో సారి చేయించిన పరీక్షలో నెగిటివ్ అని ఈ నెల 17న తేలింది. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి చూపించగా ఆన్‌లైన్‌లో పరిశీలించి వాస్తవమని చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వాకంతో కోవిడ్ వార్డులోని బాధితుల మధ్య దాదాపు 24 గంటలు ఉండాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. ఒకవేళ వారి మధ్య ఉండడం తో తనకు వస్తే ఎలా అని ఆమె ప్రశ్నించింది. దీనిపై అధికారులు స్పందించి ఆసుపత్రి యాజమాన్యం ఫై తగు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.