ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆమోదం తెలుపని గవర్నర్ !


తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆర్థిక పరమైన బిల్లు కావడంతో ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఆర్టీసీ విలీనం ఫైల్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రభుత్వం పంపించింది. అయితే ఈ బిల్లుకు రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభించలేదు.

దీంతో ఆర్టీసీ కార్మికులు గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి రేపు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపటిలోగా రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభిస్తే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే గవర్నర్ తమిళ సై ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తారా ? లేక తిరస్కరిస్తారా ? చూడాలి మరి.