ఉగ్ర’నరసింహం’ !

governaer’నేను యమ స్ట్రిక్ట్ బాబూ..’ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించిన మొదటి రోజు గవర్నర్ నరసింహన్ అన్న మాటలివి. రెండో రోజే వాటిని ఆచరించి చూపించారు. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంక్‌ల బంద్‌ను గంటల వ్యవధిలో ఉపసంహరింపజేశారు. తూనికలు, కొలతల అధికారుల దాడులకు నిరసనగా పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే.

బంక్ ల బంద్ తో వాహనదారులు పెట్రోల్ లేక నానా అవస్థలు పడ్డారు. ట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగిన గవర్నర్ గంటలో సమస్యకు స్వస్తి చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌ తో నరసింహన్ మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

మరోవైపు, నామినేటెడ్ పదవుల్లోని వారిపై దృష్టి పెట్టారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు సోమవారం నోట్ అందింది. ఇప్పటికే రాజీవ్ యుువకిరణాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.సి.రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలసి రాజీనామా చేశారు.

ఇక, విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపైన నరసింహన్ దృష్టి సారించారు. వీటిపై నివేదిక పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కోరారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రిలు తమకు కావాల్సిన వారి పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రిగా కిరణ్ వున్న సమయంలో.. జారీ అయిన జీవోల వివరాలను సేకరించే పనిలో పడ్డారు నరసింహన్. మొత్తానికి తనదైన మార్క్ చూపిస్తున్నారు మన గవర్నర్.