ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్‌ఫర్నిష్డ్ గృహాలకు సంబంధించిన నిబంధనలు మారాయి.2011 జనాభా లెక్కల ప్రకారం.. 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది.