ప్రత్యేక కేబినేట్ ముందుకు జీవోఎం నివేదిక.. ?

cwcరాష్ట్ర విభజనపై జీవోఎం కసరత్తు ముగిసినట్లు తెలుస్తోంది. నిన్న పూర్తిస్థాయిలో సమావేశమయిన జీవోఎం విభజన అంశాలపై దాదాపు మూడున్నర గంటల పాటు విసృతంగా చర్చలు జరిపింది. అయితే, హైదరాబాద్, రాయల తెలంగాణ అంశాలపై మాత్రం తుది నిర్ణయానికి రానట్లు సమాచారం. ఈ రెండు అంశాలపై రాజకీయ నిర్ణయం తీసుకొని, నివేదికకు ఆమోద ముద్ర వేసే అధికారాన్ని కేంద్ర హోంశాఖకు అప్పగిస్తూ జీవోఎం చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పినట్లుగా జీవోఎం మరిన్ని భేటీలు వుండకపోవచ్చు. హైదరాబాద్ ను యూటీ, భద్రాచలం ను సీమాంధ్రలో చేర్చండని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్న అవేవి జీవోఎం పట్టించుకోకపోవడం విశేషం.

తెలంగాణ ఏర్పాటుపై కేబినేట్ చేసిన ఏకగ్రీవ తీర్మాణానికి అనుగుణంగానే జీవోఎం విభజన నివేదికను తయారు చేసినట్లు విశ్వనీయ సమాచారం. హైదరాబాద్ ను యూటీ చేయకుండా.. పరిమిత ఆంక్షలు విధించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శాంతి భద్రలు, ల్యాండ్ రెవిన్యూ, మున్సిపల్ పాలన, ఉన్నత విద్యకు సంబంధించిన అధికారాలను గవర్నర్ కు అప్పగించే అవకాశం వుంది. ఇక, భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపడం కూడా కల్లె. అయితే, పోలవరం ముంపునకు గురయ్యే అవకాశం వున్న గ్రామాలను మాత్రం సీమాంధ్రలో కలపాడానికి జీవోఎం అంగీకరించినట్లు తెలుస్తోంది.

విభజన బిల్లు దాదాపు ఖరారైనప్పటికినీ.. అది ఈరోజు (గురువారం) జరగే కేబినేట్ ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పైగా, షిండే నే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే, గతంలో తెలంగాణ నోట్ ను కేబినేట్ ముందు టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చినట్లుగా.. విభజన నివేదికను తీసుకొచ్చే అవకాశము లేకపోలేదు. విభజన నివేదిక ఈరోజు కేబినేట్ ముందుకు రానియెడల.. ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేకంగా కేబినేట్ ను సమావేశపరచి నివేదికను ఆమోదించే అవకాశాలున్నట్లు సమాచారం.

రాయల తెలంగాణ అంశం ఇంకా సజీవంగా వున్న నేపథ్యంలో.. హోం మంత్రి షిండే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడమే తరవాయి.. తదనంతరం విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. రాయలతెలంగాణ అంశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ దిశగా నిర్ణయం వుండకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల భావన.