తుదిరూపం ఇస్తారా.. ?

GoM_meet
విభజనపై ఏర్పడిన మంత్రుల బృందం ’విభజన నివేదిక’కు తుది రూపాన్ని ఇచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావు.. తదితరులతో సమావేశమైన మంత్రుల బృందం ఈరోజు ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులతో భేటీ అయింది. ఇరు ప్రాంతాల నేతలు చేసిన పలు సూచనలను జీవోఎం శ్రద్దగా ఆలకించింది. అయితే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీ-బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలగా వుండటంతో.. ఇవాళ లేదా రేపటి లోగా విభజన నివేదికకు జీవోఎం ఖచ్చితంగా తుదిరూపం ఇవ్వాల్సిన పరిస్థితి.

విభజనపై ఏర్పడిన జీవోఎం ఈరోజు భేటీయే చివరిదని వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఇవాళ్టి జీవోఎం సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. కొద్ది సేపటి క్రితమే హోంశాఖ కార్యాలయం నార్త బ్లాక్ లో జీవోఎం సమావేశమయింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గులాంనభీ ఆజాద్ మినహా మిగతా సభ్యులందరూ హాజరయ్యారు. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో.. ఆజాద్ బిజీగా వుండటం వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ఈ సమావేశంలో హైదరాబాద్ అంశం, ఆర్టికల్ 371డీ పైనే చర్చిస్తున్నట్లు సమాచారం. విభజన అంశం తుది అంకానికి చేరుకుందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్న నేపథ్యంలో.. ఈ భేటీలోనే విభజన నివేదికకు తుదిరూపం ఇచ్చి.. అధినేత్రి సోనియా ముందు వుంచుతారా.. ? లేదా మరిన్ని సమావేశాలు నిర్వహిస్తారా.. ? అన్నది తెలియాల్సి వుంది. అయితే, ఇదే చివరి జీవోఎం సమావేశం కాదని హోం మంత్రి షిండే ప్రకటించడం, ఈ సమావేశానికి ఆజాద్ హాజరు కాకపోవడం చూస్తుంటే.. జీవోఎం మరోమారు సమావేశమై విభజన నివేదికకు తుదిరూపం ఇచ్చే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.