కోవిడ్ -19 మహమ్మారి నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు జర్నలిస్టులు, ఉద్యోగులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి చొరవతో ఏర్పాటుచేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు, ఉద్యోగులు హాజరై కో-వ్యాగ్జిన్ వ్యాక్సిన్ ను వేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ….ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన మున్సిపల్ సిబ్బందితో పాటు జర్నలిస్టులందరూ వ్యాక్సిన్ ను తీసుకోవడంతో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి పారిశుధ్య వర్కర్లందరికీ వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. నేడు జిహెచ్ఎంసిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 120 మంది జర్నలిస్టులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని మేయర్ విజయలక్ష్మి తెలియజేశారు.