దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టపెడతారా అని ఎదురుచూస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 7 గంటలకే తొలి ఓటును వేశారు. ఆయన సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు వేశారు. చిరంజీవి దంపతులు ఉదయం 8 గంటల లోపే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు వేశారు. ఫిల్మ్‌నగర్ క్లబ్బులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, ఓటు వేశారు. హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 1752 హైపర్ సెన్సిటివ్, 2934 సెన్సిటివ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2909 పోలింగ్ లొకేషన్లున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు 52,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు 1729 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 150 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 660 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు.