Site icon TeluguMirchi.com

జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిద్ -19 పాజిటివ్ కేసుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై పాక్షిక ఆంక్షలు విధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఉదయం నుండే కార్యాలయ వేళల్లో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి వివిధ సెక్షన్లకు పనుల నిమిత్తం వస్తున్నారని, రాష్ట్రంతోపాటు రోజు రోజుకు నగరంలో పెద్దఎత్తున కొత్త కేసులు నమోదవుతునందున కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ లోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా ఈ పాక్షిక ఆంక్షలు ప్రవేశ పెడ్తున్నట్టు ప్రకటించింది.

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా కచ్చితంగా కోవిద్ నియమ నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం, మాస్క్ లను ధరించడం, హ్యాండ్ వాష్ చేయడం విధిగా చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల సందర్శనపై కూడా ఈ ఆకంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. తమ ఆరోగ్య భద్రతా దృష్ట్యా కార్యాలయానికి రావద్దని సూచించారు. ఏదైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉండే మై-జీహెచ్ఎంసీ యాప్ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద నున్న గ్రీవిఎన్స్ సెల్ లో దారకాస్తులు అందచేయాలని పేర్కొన్నారు. కోవిద్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నందున కార్యాలయంలోని అధికారులు, సెక్షన్లలో సిబ్బందిని సాధ్యమైనంత మేర కలువవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సందర్శకుల ఆంక్షలపై జీహెచ్ఎంసీ అధికారులకు, సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జీహెచ్ఎంసీ లో జరిగే అధికారిక సమాచారాన్ని సీపీఆరోఓ ద్వారా పత్రికా ప్రతినిధులకు అందచేయడం జరుగుతుందని, ఏదైనా అదనపు సమాచారం కోసం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అవసరమైతే ఉదయం నుండి కాకుండా మధ్యాహ్నం 3 గంటలనుండి ఐదు గంటల లోపు కార్యాలయంలోని సీపీఆర్ఓ గారిని మాత్రమే కలవాలని తెలిపారు. పాత్రికేయుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. విభాగాధిపతులను కానీ, సెక్షన్ అధికారులను కానీ కలవద్దని జర్నలిస్టులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలువురికి కోవిద్ పాజిటివ్ వచ్చినందున ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పాక్షికంగా పై నియంత్రణ చర్యలను చేపట్టినట్టు, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని జీహెచ్ఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version