నగరంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు మరిన్ని పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసిలో అమలవుతున్న అభివృద్ది, స్వచ్ఛ కార్యక్రమాలపై జోనల్ వారి సమీక్ష సమావేశాలకు మేయర్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నేడు ఖైరతాబాద్ జోన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ప్రావిణ్య, సంబంధిత డిప్యూటి కమిషనర్లు, ఇంజనీర్లు, వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో గ్రీనరిని పెంపొందించడంతో పాటు నగర సుందరీకరణకు సాధ్యమైనంత అధిక సంఖ్యలో చెట్లను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని బిన్ లెస్ సిటీగా మార్చడాన్ని ప్రస్తావిస్తూ వీధులలో పేరుకుపోయే చెత్తను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో మరో 10 రోజుల అనంతరం ఎక్కడ చెత్త పేరుకుపోయిన సంఘటనలు రావొద్దని సూచించారు. నగర పౌరుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టాయిలెట్లను ధ్వంసం చేయడంతో పాటు వాటిలోని పరికరాలను దొంగిలించేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని మేయర్ ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్ల పర్యవేక్షణను సమీపంలోని స్ట్రీట్ వెండర్లకు అప్పగించాలని సూచించారు. 60 ఏళ్లకు పైబడ్డ పారిశుధ్య కార్మికులను గుర్తించి వారి స్థానంలో వారు సూచించిన కుటుంబ సభ్యులకు నియమకాలు జరపాలని మేయర్ తెలిపారు.
నగరంలో కరోనా తిరిగి ఉధృతమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటైజేషన్ లను నిర్వహించాలని ఎంటమాలజి అధికారులను ఆదేశించారు. రుతుపవనాల ప్రవేశానికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నందున ఈ రెండు నెలల కాలంలో నాలాల పూడిక పనులను పూర్తిచేయాలని అన్నారు. సదుద్దేశంతో ప్రారంభించిన ఫీడ్ ది నీడ్ రిఫ్రిజిరేటర్లు వృథాగా ఉన్నాయని, ఈ రిఫ్రిజిరేటర్లను సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు అనుసంధానం చేసినట్లైతే అదనపు ఆహారం ఈ రిఫ్రిజిరేటర్ లో ఉంచే అవకాశం ఏర్పడుతుందని మేయర్ సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలలో నగర పౌరులను భాగస్వామ్యం చేసేందుకు పరిచయం కార్యక్రమం, శానిటేషన్ సిబ్బంది వివరాలను తెలిపే వాల్ రైటింగ్ లను తిరిగి ప్రారంభించాలని విజయలక్ష్మి ఆదేశించారు.