Site icon TeluguMirchi.com

నజరానా…

Hyderabad-Clen-KCR
గ్రేటర్లో గులాబీ జెండా ఎగరవేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. గ్రేటర్ లో అన్ని వర్గాల ప్రజల అవసరాలన్నింటిని తీర్చే పనిలో పడ్డారు కేసీఆర్. మొన్నటికి మొన్న ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ పండుగ సందర్భంగా బట్టలను బహుమతిగా ఇచ్చిన కేసీఆర్… తాజాగా బోనాల పండుగ ఏర్పాట్ల కోసం పది కోట్ల కేటాయించారు.

సమీప భవిష్యత్తులో… జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాగైనా గ్రేటర్ లో పాగా వేయాలని టిఆర్ఎస్ సర్కారు పావులు కదుపుతోంది. గ్రేటర్ లో ప్రతి అవకాశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు భారీ స్థాయిలోనే కసరత్తు చేస్తోంది సర్కారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి గ్రేటర్ లో గట్టిగా తన సత్తా చాటలేదు. . 2004 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా… మొన్నటి 2014 ఎన్నికల్లో పద్మారావు గౌడ్ మాత్రమే గెలిచారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాదరావు ఓటమిపాలయ్యారు. దీంతో గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరవేయాలనే కసితో పని చేస్తున్నారు కేసీఆర్.

తెలంగాణలోని పది జిల్లాల్లో బోనాల పండుగను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది టిఆర్ఎస్ సర్కారు. గ్రేటర్ లో బోనాల పండుగను జరిపేందుకు దేవాదాయ శాఖ ద్వారా ఐదు కోట్లు, జిహెచ్ఎంసి నిధుల నుంచి ఐదు కోట్లు వెచ్చించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. రంజాన్ సందర్భంగా మైనార్టీలపై వరాలు కురిపించిన కేసీఆర్..ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గానికి 20 లక్షలు కేటాయించారు.

ధార్మిక కార్యక్రమాల ద్వారా గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునేందుకే తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. రంజాన్, బోనాలను ప్రభుత్వం తరుపున చేపట్టి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు గ్రేటర్ మంత్రులు. దీంతోపాటు గ్రేటర్ లో సమ్మె చేసిన మున్సిపల్ కార్మికుల పై కూడా కేసీఆర్ వరాలు కురిపించారు. ఇతర ఉద్యోగుల కంటే అత్యధికంగా 47 శాతం జీతాలు పెంచారు. గ్రేటర్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారు. సో ఇలా ప్రతి వర్గాన్ని ఎన్నికల నాటికి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Exit mobile version