గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల అంశం పై ప్రజల్లో గందరగోళం కలిగించే విధంగా కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలను విశ్వసించరాదని సూచించారు.
2016 ఎన్నికల్లో అమలు చేసిన డివిజన్ లు, రిజర్వేషన్స్ లో ఎలాంటి మార్పులు ఉండవని, 2016 ఎన్నికలలో ఉన్న రిజర్వేషన్ లు, వార్డులు యదావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి ఈ ఏడాది జరిగిన స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆధారంగా ఎన్నికల ఓటరు జాబితా రూపొందుతుంది. ఆ మేరకు ఈ సారి కూడా జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ జిహెచ్ఎంసి ఓటరు జాబితాలో ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి వార్డులు పోలింగ్ స్టేషన్ లు వారిగా ఓటరు జాబితా రూపొందించడం జరుగుతుందని వివరించారు. జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ అంశం పై అనధికారిక వార్తలను విశ్వసించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.