Site icon TeluguMirchi.com

తెదేపాలోకి గంటా.. ?

ganta in tdpమంత్రి గంటా శ్రీనివాస్ తెదేపాలోకి వస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతకొద్దిరోజులుగా ఈ ప్రచార పర్వ కొనసాగుతున్నప్పటికినీ.. ఈరోజు (బుధవారం) తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గంటా కూమార్తె వివాహానికి హాజరుకావడంతో ఇది మరింత బలపడింది. బాబుతో పాటుగా పెద్ద సంఖ్యలో తెదేపా నేతలు నేటి వివాహానికి హాజరుకావడం విశేషం. దీంతో.. విశాఖపట్నం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

తెదేపాలోనికి గంటా రాకపై కాస్త అసంతృప్తిని ప్రదర్శించినట్లుగా వార్తలొస్తున్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విశాఖలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తనకు నర్సీపట్నం అసెంబ్లీ సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటుపై అధినేత వద్ద హామి తీసుకున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం అయ్యన్న చాలా ప్రశాంతంగా కనబడటం చూస్తుంటే.. అధినేత హామిపై ఆయన సంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా సైకిల్ పై సవారీకి వున్న కాస్త అలజడి కూడా తొలగినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో  గంటా శ్రీనివాస్ తెదేపాలో కీలక నేతల్లో ఒకరిగా వున్న విషయం తెలిసిందే. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో.. గంటా చిరు పంచన చేరారు. చిరుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన గంటా ప్రజారాజ్యంను కాంగ్రెస్ విలీనం కావడంతో.. ఆయనతో పాటుగా హస్తం పార్టీతో చేయికలిపాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది చెందిన వర్గంలో ముఖ్య నేతగా వున్నారు. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్న గంటా.. తిరిగి తన సొంత గూటి(తెదేపా)లోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు తెదేపా అధినేతతో సంప్రదింపులు సైతం ముగిసాయని.. ఇక గంటా పచ్చజెండా పట్టుకోవడమే తరువాయి అని సమాచారం.

కాపు సమాజిక వర్గానికి చెందిన గంటా తెదేపాలో చేరినట్లయితే.. విశాఖ రాజకీయ సమీకరణాలే సమూలంగా మారే అవకాశం వుంది. గంటా చేరికతో వైజాగ్ లో వైకాపా జోరుకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో వైకాపా నేతలు కొణతాల, దాడి వీరభద్రా రావు మధ్య నెలకొన్న విభేధాలు కూడా తెదేపా కలసిరావచ్చు. అంతేకాకుండా.. కొణతాలకు వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరిస్తున్నట్లు కొన్ని టీవి ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఇదే నిజమైతే.. వైకాపాలో అసతృప్తి మరింత అందలమెక్కే ఏర్పడవచ్చు.  ఈ నేపథ్యంలో.. గంటా చేరికతో.. విశాఖలో తెదేపా మరింత పటిష్టతకు దారి తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version