గన్నవరంలో అరాచకం సృష్టించిందెవరు ?


గత కొంతకాలంగా టీడీపీ, వైపీసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరగడంతో.. రాష్ట్రంలో బహిరంగ సభలకు, రోడ్ షోలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోంది. పోలీసుల అనుమతి తీసుకున్నాకే సభలకు, రోడ్ షోలకు పర్మిషన్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం ఘటన హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నేత పట్టాభి గన్నవరం టీడీపీ ఆఫీసుకు వెళ్లి .. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఫర్మిచర్, కార్లను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన సీఐపై దాడి చేశారు. గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పట్టాభి ప్రయత్నించారని అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. గన్నవరంలో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ పెట్టారు. అనంతరం అతన్ని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా అతన్ని అడ్డుకున్నారు. దీంతో బాబు రాష్ట్రంలో పాకిస్తాన్ లాంటి పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో గన్నవరంలో అరాచకం సృష్టించారని తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని సైతం బాబుకు కౌంటర్ ఇచ్చారు. గన్నవరంలో ఒక్కరోజు మాత్రమే 144 సెక్షన్ అమలులో ఉందని.. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. బాబు కావాలంటే అస్సాం కూడా వెళ్లొచ్చంటూ ఎద్దేవా చేశారు. వల్లభనేని వంశీ సైతం తన నియోజక వర్గంలో పట్టాభికి ఏం పని అంటూ ప్రశ్నించారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని, పార్టీ వాళ్ల తాత ఏర్పాటు చేసిందంటూ పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు కారణమైన పట్టాభికి కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం వివాదం సద్దుమణిగింది.