భారత్‌కు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు పంపి బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు కూడా పంపనున్నట్లు ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి మేరకు ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించినట్లు లెనైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
భారత్‌కు పంపుతున్న ఎనిమిది ఆక్సిజన్ జనరేటర్లలో ప్రతి ఒక్కటి 250 పడకల ఆసుపత్రికి పదేళ్ల పాటు ప్రాణవాయువు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్నవన్నారు. ఐదు కంటైనర్ల మేర ద్రవ ఆక్సిజన్ కూడా తొలి విడతలో పంపుతున్నామని, దాదాపు 10 వేల మంది రోగులకు ఒక రోజుకు సరిపడా ఆక్సిజన్‌ను అవి సమకూర్చగలవని లెనైన్ వివరించారు. వీటితోపాటు 28 వెంటిలేటర్లు, 200 వరకు ఎలక్ట్రిక్ సెరెంజ్ పంపులు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.