హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్ న్యూస్..హుస్సేన్‌సాగర్‌పై తేలియాడే వంతెన ఏర్పటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జిని హుస్సేన్‌సాగర్‌పై ఏర్పటు చేయబోతున్నారు. ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లెస్ రోడ్డులోని వీపీ ఘాట్ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఏపీ సహా పలు రాష్ట్రాలు, దేశ, విదేశీ పర్యాటలను ఎంతగానే ఆకట్టుకునే హైదరాబాద్.. త్వరలోనే మరింత కనువిందు చేయనుందన్నమాట.
రష్యా రాజధాని మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై తేలియాడే వంతెన ఉంది. ఆ దేశంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఆ బ్రిడ్జి ఒకటిగా నిలుస్తోంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని తీర్చిదిద్దిన విధానం ఇంజినీరింగ్‌లో ఓ అద్భుతంగా నిపుణులు పేర్కొంటారు.