Site icon TeluguMirchi.com

ఆంద్ర లో బాబు తొలిఅడుగు అదిరింది

Vastunna Meekosam Chandrababu Naiduఎన్నో ఉద్రిక్తతలు, బెదిరింపులు, ఊహాగానాలు, హెచ్చరికలు, అడ్డంకుల మధ్య సోమవారం నాడు నల్గొండ జిల్లాను దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబునాయుడు ‘ వస్తున్నా…మీకోసం ‘ పాదయాత్ర ఆరంభమే అదిరింది. కృష్ణా జిల్లా ప్రజానీకం ఆయనకు బ్రహ్మరధం పట్టారు. కృష్ణా జిల్లా లోకి అడుగుపెడుతున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగిస్తానంటూ హెచ్చరికలు చేసిన విజయవాడ ఎం.పి. లగడపాటి రాజగోపాల్, ఇతర కాంగ్రెస్ నాయకులు, ఎం.ఎల్.ఎ.ల ప్రకటనల కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బాబు కృష్ణా జిల్లా లోకి ప్రవేశించారు. బాబు జిల్లా సరిహద్దుల్లోకి అడుగుపెట్టగానే అప్పటికే అక్కడ గుమికూడిన వేలాదిమంది కార్యకర్తలు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మేళతాళాలు, డప్పు, సన్నాయి, కోలాటాలు, బ్యాండు మేళాలతో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు గరికపాడు చెక్ పోస్టు దగ్గర ఘన స్వాగతం పలికారు. తొలిరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో నడిచిన బాబు కోసం జాతీయ రహదారిపై పసుపు దళాలు కవాతు చేసాయి. మహిళా నాయకురాళ్ళు పాదయాత్ర అగ్రభాగాన హల్ చల్ చేశారు. రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాదయాత్ర లో పాల్గొన్నారు. పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీ, చిన్నపిల్లల్లా కాన్వాయ్ లో అటూ ఇటూ తిరిగి హడావిడి చేశారు. తమ గ్రామానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పోటెత్తారు. దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర జనంతో కిక్కిరిసిపోయింది. బాబు యాత్రకు స్వంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుందని ఆశించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రజాస్పందన చూసి అవాక్కయ్యారు.

Exit mobile version