Site icon TeluguMirchi.com

బీఆర్ఎస్ నేతలకు ‘పొంగులేటి’ సవాల్


దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘నా మద్దతుదారులను సస్పెండ్ చేస్తున్నారు. ఈరోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను. దమ్ము, ఖలేజా ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి’ అంటూ సభావేదిక నుంచి సవాల్ చేశారు.

‘పొంగులేటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా?’ అని అడుగుతున్న నేతలు గత డిసెంబర్ వరకు పార్టీ సభలు, సమావేశాలకు నాకు ఎందుకు ఆహ్వానం పంపారు? ఫ్లెక్సీల్లో నా ఫోటోలు ఎందుకు ఉపయోగించారు? ఎన్నికలప్పుడు నా సాయం ఎందుకు కోరారు’ అని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో చేరినా ఇప్పుడు నేను ప్రకటించిన అభ్యర్ధులే, ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల బరిలో ఉంటారు. అలా చేయగలిగే దమ్ము, ధైర్యం నాకు ఉంది’ అని పొంగులేటి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతున్నారో క్లారిటీ లేదు. బీజేపీ లో చేరుతున్నారు అనుకొనే లోపు వైస్సార్సీపీ నేతలతో భేటీ అయి కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు కానీ అభ్యర్థులను మాత్రం ప్రకటిస్తున్నారు పొంగులేటి. తాజాగా వైరా నుండి పోటీ చేసే అభ్యర్థి విజయభాయి అని వెల్లడించారు.

Exit mobile version