ఏలూరు లో గత వారం రోజులుగా వింత వ్యాధి ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 583 కి చేరింది. వీళ్లలో 470 మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన చికిత్స కోసం 20 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ వింత వ్యాధి ఎలా వచ్చిందనేది శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎస్) శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో పాటు పలు శాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం నీటి నమూనాలను విజయవాడలోని ఓ పరీక్షా కేంద్రంలో పరిశీలించగా విస్మయపరిచే ఫలితాలు వెల్లడయ్యాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరిమితికి మించి వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు. కృష్ణా కాలువలో తీసుకున్న లీటర్ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.