ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు…కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత వేగవంతం చేసాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. బుధవారం దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇక ఈ కేసులో గౌతమ్ మల్హోత్రాను కూడా బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రికంక్ కో సేల్స్ సంస్ధకు డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. ఢిల్లీ ఆప్ నేతలతో మల్హోత్రాకు పరిచయాలు ఉన్నాయని, వారి అండతోనే ఈ లిక్కర్ బిజినెస్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ స్పిరిటీ కంపెనీలతో మల్హోత్రాకు లింక్స్ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.