Site icon TeluguMirchi.com

పీసీసీ రేసులో డీఎస్ ?

D. srinivasపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తొలగిస్తున్నారా..? అంటే నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొత్స స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ పిసిసి అధ్యక్షుడు, విధానమండలి సభ్యుడు డి.శ్రీనివాస్ కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, ఈ విషయంపై డి. శ్రీనివాస్ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో దాదాపు అరగంటకు పైగా చర్చించినట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలం నుండి పిసిసి అధ్యక్షునిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ ఆ పదవి నుండి తప్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్న సందర్బంలో డిఎస్ సోనియాగాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న నేపథ్యంలో.. టీ-కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పి తెరాసలో చేరడానికి సిద్ధమవుతుండడంతో.. డి.శ్రీనివాస్ ను పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే తెలంగాణ ప్రాంతాని ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుందని, దీని ద్వారా కాంగ్రెస్ నుండి తెరాస వలసలను కొంతవరకు అడ్డుకట్టవేయవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పీసీసీ అధ్యక్షుడు బొత్స, సీఎం కిరణ్ ల మధ్య సమన్వయ లోపం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో.. అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి మార్పుకు మొగ్గు చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నేత కె. కేశవరావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికినీ ఆయన కొంతకాలంగా టీఆర్ ఎస్ కు కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అధిష్టానం డి. శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డి. శ్రీనివాస్ కు పీసీసీ అధ్యక్షుడిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని కాంగ్రెస్ పెద్దల భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version