Site icon TeluguMirchi.com

కోవిడ్ కు విరుగుడు, డి.ఆర్.డి.ఒ. ఔషధం!

కరోనా వైరస్ ను కట్టడి చేసే లక్ష్యంతో రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) రూపొందించిన 2-డీ యాక్సీ డి-గ్లూకోజ్‌(2 డి.జి.) అనే కోవిడ్ 19 ఔషధం తొలి విడత మందును రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. పొడి రూపంలో ఉండే ఈ మందును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, భూగోళ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కు రక్షణ మంది అందజేశారు. 2-డి.జి. పొడి మందు సాచెట్లు కలిగిన ఒక్కొక్కటి చొప్పున పెట్టెలను అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు, సాయుధ బలగాల వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్.) లెఫ్టినెంట్ జనరల్ సునీల్ కాంత్ కు కూడా అందజేశారు. కోవిడ్ రోగుల చికిత్సలో అత్యవసర వినియోగం కోసం దేశంలోని వివిధ ఆసుపత్రులకు కూడా మరిన్ని బాక్సులతో కూడిన ఈ మందును త్వరలో పంపిణీ చేయనున్నారు. కోవిడ్ వైరస్ కు విరుగుడుగా పనిచేసే ఈ 2 డి.జి. మందుతో కూడిన ఒక్కొక్క బాక్సును డి.ఆర్.డి.ఒ. పరిశోధన శాలకు చెందిన న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ మెడిసిన్ ఇన్.స్టిట్యూట్(ఇన్మాస్), హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ (డి.ఆర్.ఎల్.) సంస్థ కలసి రూపొందించాయి.

ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఒ., డి.ఆర్.ఎల్.లను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్  అభినందించారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన అత్యవసర పరిస్థితిని నివారించి, వారు సత్వరం కోలుకునేందుకు దోహదపడే ఔషధాన్ని తయారు చేయడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. దేశం సాధించిన వైజ్ఞానిక ప్రతిభా పాటవాలకు, ఈ మందు గట్టి ఉదాహరణ అని, స్వావలంబన సాధనా కృషిలో ఇది ఓ మైలురాయి వంటిదని కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.

Exit mobile version