సీఎం ప్రక్కన.. ఓ భజన బృందం !

Dokka Manikya Vara Prasada Raoముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రులు వార్ ప్రకటించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ మంత్రులే కాదు.. సీమాంధ్రకు చెందిన మంత్రులు కూడా కిరణ్ పేరు చెబితేనే.. ఒట్టి కాలుపై లేస్తున్నారు. తాజాగా, మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్ సీఎం కిరణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కిరణ్ పొగడ్తలకు అలవాటు పడ్డారన్న డొక్కా, ఓ భజన బృందం ఆయన పక్కన చేరి చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను డొక్క తప్పుబట్టారు. సీఎం వ్యాఖ్యలు తనకు ఆందోళన కలిగించాయని, ఇష్టం లేకపోయినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అంతేకాని అధిష్ఠానాన్ని సీఎం బహిరంగంగా వ్యతిరేకించడం తప్పని సూచించారు. ‘సీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు మాకు నచ్చవు.. అలాగని మేము వ్యతిరేకించడం లేదు కదా?’ అని సూటిగా ప్రశ్నించారు.మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావులు తన నిర్ణయాన్ని వినడంలేదనే వారిని తప్పించారని డొక్కా గుర్తు చేశారు. సీమాంధ్ర నేతల నుంచి కొత్త పార్టీ వస్తుందన్న వార్తలపై డొక్క స్పందిస్తూ..  ప్రత్యేక పార్టీ అనేదేలేదని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలు చక్కదిద్దాలంటే ఎన్టీఆరో, వైఎస్సో తప్పకుండా అవసరమని డొక్కా అభిప్రాయపడటం విశేషం.