అందగాడు కిరణ్ కుమార్

cm kiranసాధారణంగా రాజకీయ నాయకులపై ఆరోపణలు విమర్ళలు రావడం సహజమే. అయితే అవన్నీ వారి చేతగానితనం మీదనో, అవినీతి, ఆశ్రిత పక్షపాతం పైనో వుంంటూ వుంటాయి. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రవీంద్రరెడ్డి కోత్త తరహా విమర్శ చేసి, జనాల్లో భలే ఆసక్తి పెంచారు. ‘ఫేసియల్ చేయించుకుని, ఫొటోలు దిగడం’ అభివృద్ధి కాదంటూ మాట విసిరారు. అరె, ఇదేదో చిత్రంగా వుందే అనుకున్నారు విన్నవారు. పాపం, ముఖ్యమంత్రి అంటే, చెమటలు కారుస్తూ, 24గంటలు కష్టపడుతూ కనిపించాలన్నది డిఎల్ ఉద్దేశం అయి వుంటుంది. ఇంతకీ ఫొటోలు దిగడం సరే, ఈ ఫేషియల్ వ్యవహారం ఎందుకు వచ్చింది మధ్యలో అన్నది కూడా అనుమానమే.

అంటే కిరణ్ కాస్త అందగా కనిపిస్తున్నట్లు, డిఎల్ అంగీకరించినట్లేగా. అయినా ఎవరైనా సరే, ఫొటో దిగాల్సి వస్తే, కాస్త జుట్టు సరిచేసుకోకుండానూ, ముఖానికి కాస్త ఫౌడర్ రాసుకోకుండానూ వుండగలరా? రాయలసీమ రాళ్ల మధ్య, ఎండలకు ముఖం కందిపోయి, ఇలా అయిపోయి వుంటారు కానీ, లేకుంటే డిఎల్ కూడా అందగాడే. కిరణ్ అంటే హైదరాబాద్ లో పెరిగాడు, పైగా పెద్ద వయసు కాదు కాబట్టి, కాస్త అందంగా వుండాలని, కనిపించాలని అనుకోవడంలో తప్పేమీ లేదు. అందుకే కాస్త అప్పుడప్పుడు ఫేషియల్ చేయించుకుంటారేమో? అవును. అది సరే, ఈ సంగతి డిఎల్ కు ఎలా తెలిసిందబ్బా? ఎప్పుడన్నా కలిసేందుకు పోతే, ‘సారు..ఫేషియల్ చేయించుకుంటున్నారు..’అని నౌకర్లు సెలవిచ్చారా ఏమిటి? పోనీ చేయించుకున్నారని, కుంటారని అనుకుందాం..మరి అవసరం కూడా చూడాలి కదా? అవతల పక్కలో బల్లెంలా తయారవుతున్నది ఎవరు? మెగాస్టారు చిరంజీవి. ఆయన మేకప్ లేకుండా బయటకు రారు కదా. అలవాటైపోయిన ప్రాణం మరి. మరి ఆ స్టారు మందు ఈ సిఎం సారు కూడా కాస్త మెరవాలంటే ఫేషియల్ అవసరమే కదా? లేకుంటే అధిష్టానం దగ్గర..’స్టారును చూసిన కళ్లతో సారును చూస్తే’ అన్న సామెతలా వుంటుంది.

మరి ఈ సమస్యను గమనించయినా డిఎల్ ఈ ఫేషియల్ సంగతిని వెల్లడించకుండా వుండాలి కదా? ఇప్పుడు చూడండి ఏమవుతుందో? ఓహో..రాజకీయనాయకులకు కూడా ఫేషియల్ అవసరం అన్నమాట, అని మిగిలిన వారంతా అదే దోవన పోతారు. అసలే రాజకీయ నాయకులు వీర బిజీ. సామాన్య జనాలకు దొరకరు. మరి అలాంటి వారికి ఈ ఫేషియల్ తోడయితే, అస్సలు కనే కనిపించరు. అదీ కాక, ఎన్నికలప్పుడు ఎండల్లో తిరిగి, నల్లబడిన నేతలు, అయిదేళ్లు చల్లటి గదుల్లో కూర్చుని, ఫేషియల్ చేయించుకుని, తెల్లగా మెరుస్తూ, మళ్లీ జనం ముందుకు వస్తే గుర్తు పట్టద్దా?

సరే, సందట్లో సడేమియా అని, ఇప్పు డు సెలూన్లలో కొత్త కేటగిరి వస్తుంది. రాజకీయనాయకులకు స్పషల్ ఫేషియల్ అని బోర్డులు వెలిసినా ఆశ్చర్యపోనక్కరలేదు. సిఎమ్ స్పషల్ ఫేషియల్ అని కస్టమర్ల దగ్గర మరికాస్త ఎక్కువ డబ్బులు గుంజుకోవచ్చు. చంద్రబాబుకు రెండువేళ్లు చూపడం, వైఎస్ కు ముఖాన చిరునవ్వు ట్రేడ్ మార్కులయితే, కిరణ్ కు ఫేషియల్ ఫేస్ అన్న మాట. ఏదైతేనేం..ఇలాంటి రాజకీయాలు చూసి జనం ముఖాలు ‘తెల్ల’బడిపోతాయి కాబట్టి వారికి ఇక వేరే ఫేషియల్ అక్కరలేదు.