అనర్హత వేటుకు సంబంధించి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ 18 మంది ఎమ్.ఎల్.ఎ. లకు నోటిసులు జారీ చేసారు. వీరిలో 9 మంది ఎమ్.ఎల్.ఎ. లను 13 వ తేదిన, మిగిలిన 9 మంది ఎమ్.ఎల్.ఎ.లను 14 వ తేదిన తన ముందు హాజరయి వివరణ ఇచ్చుకోవలసిందిగా ఆయన నోటిసులు పంపారు. శాసనసభలో విప్ కు విరుద్ధంగా అవిశ్వాసానికి మద్దతుగా వోటు వేసిన ఈ శాసన సభ్యులను అనర్హులను చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఒకవేళ ఈ ఎమ్.ఎల్.ఎ. లను అనర్హులుగా చేస్తే నాదెండ్ల మనోహర్ శాసనసభ చరిత్రలో రికార్డు నెలకొల్పిన వ్యక్తి అవుతారు . అంటే ఈ 18 మందిని అనర్హులుగా ప్రకటిస్తే ఇప్పటివరకు మనోహర్ 35 మందిని అనర్హులుగా
ప్రకటించినట్టు. ఇది గతంలో గతంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా వున్నప్పుడు అనర్హులుగా ప్రకటించిన సంఖ్య కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కాగా వీరందరినీ అనర్హులుగా ప్రకటించినప్పటికీ వెంటనే ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడేందుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టి వ్యూహాత్మకంగా
వ్యవహరిస్తున్నట్టు స్పీకర్ వైఖరి కనపడుతోంది. వెంటనే ఉప ఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు అటు కాంగ్రెస్ గాని, ఇటు తెలుగుదేశం గాని సిద్ధంగా లేవు.