Site icon TeluguMirchi.com

సీమాంధ్రుల భద్రత కాంగ్రెస్ భాద్యత : దిగ్విజయ్

diggiఅన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్ సింగ్‌ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని… శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై బీసీఏ సోమవారం నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లు సభకు వచ్చిన తర్వాత సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన టీడీపీ, వైఎస్సార్సీపీలు యూటర్న్ తీసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదరటంలేదంటూ ఈ రెండు పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.

ఇక రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయమే అంతిమమని కుండబద్దలు కొట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కూడా పాటించాల్సిందేనని స్పష్టం చెప్పారు. భాగ్యనగరంలో నివసించే సీమాంధ్రుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందని డిగ్గీ రాజా అన్నారు. దీనికితోడు, హైదరాబాద్ నగర పరిధిలోని సీమాంధ్రుల ఆస్తులు, ఉద్యోగాలకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.

ప్రస్తుత పిసిసి పర్యవేక్షణలోనే రెండు తెలంగాణ,సీమాంద్రలకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు స్వయంగా తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని ప్రకటించారన్న సంగతిని డిగ్గి గుర్తు చేశారు. ఇక రెండు ప్రాంతాల మధ్య విభేదాలు రావడం విచారకరమని, వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. మరో పదిహేను రోజులలో తాను విశాఖపట్నం వెళుతున్నానని చెప్పుకొచ్చారు.తెలంగాణ బిల్లుపై కేవలం అబిప్రాయ సేకరణే మాత్రమే ఉంటుందని, ఓటింగ్ ఉండదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఇటీవల కాంగ్రెస్ పై, సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి గురించి చెబుతూ…జెసి కి త్వరలోనే షోకాజ్ నోటీసు జారీ అవుతుందని తెలిపారు.

Exit mobile version