Site icon TeluguMirchi.com

డిగ్గీరాజా మంత్రాంగం !

digvijayఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును నెగ్గించుకునేందుకు దిగ్విజయ్‌ సింగ్ యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. విభజన బిల్లును ఓడించాలని పట్టుదలగా ఉన్న సీఎం కిరణ్‌కు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చలు జరిపి వారిని హైకమాండ్ లైన్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం వారికి ప్యాకీజీలు ఆఫర్ చేస్తున్నారు. అధిష్టానం చెప్పినట్టు వింటే… మిగితాది తాము చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. డిగ్గీ మంత్రాంగానికి ఎంపీలు దారిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అటు ఎమ్మెల్యేలు సైతం మెత్తబడుతున్నారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.

అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న సీఎంకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో దిగ్విజయ్‌ ఉన్నారు. పార్టీ లైన్‌లోకొచ్చిన ఎమ్మెల్యేల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ నేతలను ఒప్పించేందుకు ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు హైదరాబాద్ చేరుకున్నారు. ఓటింగ్‌లో బిల్లుకు మద్దుతు కూడగట్టేందుకు ఓ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఆపరేషన్ ఓటింగ్‌ను మొదలు పెట్టింది. సీఎంకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ను మోహరించేలా ఎత్తులు వేస్తున్నారు.

సొంతపార్టీనే కాకుండా… సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఏపిఎన్జీఓలను సైతం చీల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అశోక్‌బాబు వ్యతిరేక ప్యానెల్‌కు గాలం వేస్తున్నారు. అశోక్‌బాబు ఒంటెత్తు పోకడలు సహించని సీమాంధ్ర ఉద్యోగులు కాంగ్రెస్‌ లైన్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలను పార్టీ లైన్‌లోకి తెచ్చుకునేందుకు డిగ్గీరాజా మంత్రాంగం ఏమేరకు ఫలిస్తుందో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version