కిరణ్ దారికొచ్చాడా.. ?

digvijyasingరాష్ట్ర విభజనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం దారిలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఢిల్లీలో ఢిగ్గీరాజా ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై కాంగ్రెస్ అదిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించారని ప్రకటించారు. కిరణ్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడని.. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ కోసం పని చేశారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ ఏమైనా చెప్పుకునే అవకాశం ఉందని.. కానీ అంతిమంగా పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని ఢిగ్గీరాజా అన్నారు. తెలంగాణ విషయంలో.. ఎన్ని పార్టీలు స్టాండు మార్చినా.. కాంగ్రెస్ మాత్రం సీబీసీ నిర్ణయానికి కట్టుబడి వుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి వస్తుందని ఆయన అన్నారు. కాగా, ముఖ్యమంత్రిని మార్చే ఎజెండా ఏదీ ఈరోజు జరిగే.. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో లేదని దిగ్విజయ్ తెలిపారు.