దిగ్గూబాబూ.. భలే మెలిక

botsaసుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నది సరదా సంగతి. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించి పిసిసి అధ్యక్షుడి సంగతి అలాగే వుంది. రూట్ మ్యాప్ చేసుకురండి అంటూ కాంగ్రెస్ పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ ఒ మాట విసిరేసి పోయారు. ఆయనకేం బాగానే ఉంది. పార్టీ అధిష్టానానికి కూడా బాగానే ఉంది. మాకేం సంబంధం ఆ ముగ్గురే చేశారు ఇదంతా అని రేపు అనేసినా అనేయచ్చు. కానీ అక్కడే వచ్చింది చిక్కంతా. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ఎలాగూ పక్కా తెలంగాణా వాది.. ఆయన రూట్ అలాగే వెళ్తుంది… మ్యాప్ అలాగే వుంటుంది. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సంగతి చెప్పనక్కర్లేదు. అభివృద్ధి ద్వారా అసమానతలు తొలగిస్తే సరిపోతుందని, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని చెప్పినా చెబుతారు. మరి ఇంతకీ పిసిసి అధ్యక్షుడు బొత్సబాబు సంగతేమిటి? ఆయన చాలా కాలం నుంచి అటు ఇటు కాని ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి, గతంలో విశాఖలో నిరసన చవి చూశారు. చాలా సార్లు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తప్పేంటన్నదానిపైనా మాట్లాడారు. మరి ఆ విధంగా రూట్ మ్యాప్ ఇచ్చి, ఆంధ్రాలో తిరగగలరా? తిరిగే అవకాశం వుంటుందా? పోనీ అలా కాకుండా ఇంకోలా ఇస్తే, తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో అడుగుపెట్టగలరా? పోనీ అదీ కాకుండా, అధిష్టానం తెలంగాణా ఇచ్చేందుకు అనుకూలంగా వుందనుకుంటే, అప్పుడేమీ చేయాల్సివుంది. మొత్తానికి దిగ్గూ బాబు ఇచ్చిన ఆదేశం మన నేతలకు దిక్కులు చూసేలా చేసింది.