ఛార్జీల పెంపు సబబు కాదు : పాల్వాయి

palvai-govardhan-reddyఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపు సబబు కాదని, ఆ భారాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఛార్జీలు పెంచితే ప్రభుత్వం, పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆయన, పెంచాల్సి వస్తే అధిష్టానంతో మాట్లాడాకే సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. ఉచిత విద్యుత్ ను కొనసాగించాల్సిందేనని పాల్వాయి డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే రాజీనామా చేస్తానని మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రకటనలో చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలెవరూ ప్రజల్లోకి వెళ్లడం లేదని, ప్రతిపక్షాల విమర్శలకు జవాబు ఇవ్వటం లేదని విమర్శించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారు గెలవలేరని పాల్వాయి జోస్యం చెప్పారు.

కాగా ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుమీద మంత్రి సి. రామచంద్రయ్యతో పాటు మరో మంత్రి డి.ఎల్ కూడా గళం కలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందంటూ సి. రామచంద్రయ్య పిసిసి అధ్యక్షుడు బొత్సకు లేఖ రాసిన విషయం తెలిసిందే.