నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 9,212 పోస్టులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్లో 428 పోస్టులు తెలంగాణలో 307 పోస్టులు కలవు.
ఇక దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ,ఎస్టీ,మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జూన్ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. కంప్యూటర్ బేస్డ్‌టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది.
కాగా, కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు వయో పరిమితి విధించారు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు వేతన స్కేలు: రూ.21,700 నుంచి రూ.69,100గా ఉంటుంది. CRPF రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారిక వెబ్‌సైట్ www.crpf.nic.in లో చూడొచ్చు. మరి.. టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.