గర్భిణీలు కూడా కోవిడ్-19 వాక్సిన్ తీసుకోవచ్చు, క్లారిటీ ఇచ్చిన కేంద్రం

గర్భిణులకు కోవిడ్ -19 కు టీకాలు వేయడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఆమోదం తెలిపింది.నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) సిఫారసుల ఆధారంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకాను తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు గర్భిణులకు ఉంటుంది. గర్భిణులకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా అమలు చేయాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలను పంపింది. 

రోగనిరోధకత, ప్రజారోగ్యం, వ్యాధి నియంత్రణ మరియు సమాచార సాంకేతిక రంగాలలో అగ్రశ్రేణి నిపుణులు అందిస్తున్న సిఫార్సులు, సూచనలకు అనుగుణంగా దేశంలో జాతీయ కోవిడ్ టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. శాస్త్రీయ అంశాలు,అంటువ్యాధి రంగంలో పరిశోధనల ఆధారంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి  నిపుణులు, ఆరోగ్యం మరియు ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వ్యాధి బారినపడే అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది. ఇంతవరకు గర్భిణులకు మినహా మిగిలిన అన్ని వర్గాలకు ఈ కార్యక్రమంలో భాగంగా టీకాలను ఇస్తున్నారు. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో గర్భిణులు కూడా జాతీయ టీకా కార్యక్రమం పరిధిలోకి వస్తారు. 

గర్భంతో ఉన్న  సమయంలో కోవిడ్ -19 బారిన పడే  స్త్రీల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుందని దీనివల్ల వారికి  తీవ్రమైన వ్యాధులు సోకే అవకాశం ఉండడమే కాకుండా  కడుపులో ఉండే పిండంపై  కూడా ప్రభావం చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. దీనిపై అధ్యయనాలు నిర్వహించిన నిపుణులు సాధారణ మహిళలతో పోల్చి చూస్తే కోవిడ్-19 బారిన పడిన గర్భిణులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని గుర్తించారు. ఇంతేకాకుండా కోవిడ్-19 సోకిన గర్భిణులు ముందుగానే ప్రసవించడమే  కాకుండా ఇతర సమస్యలను ఎదుర్కోనే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని సమయాల్లో శిశువు మరణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. శిశు మరణాలను తగ్గించి, ముందస్తు ప్రసవాలను తగ్గించి గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు వారికి టీకాలను ఇవ్వాలని నిపుణులు సూచించారు. 

సిఫార్సుల ఆధారంగా గర్భిణులకు టీకాలను ఇవ్వాలని  నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఐజి) సిఫార్సు చేసింది. టీకాల పర్యవేక్షణకు ఏర్పాటైన నిపుణుల బృందం కూడా ఈ సిఫార్సులను ఏకగ్రీవంగా ఆమోదించింది. గర్భిణులకు టీకాలను ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ వర్గాలతో సంప్రదింపులు కూడా  జరిపింది. గర్భిణులకు టీకాలు ఇవ్వాలంటూ ఎన్‌టిఐజి చేసిన సిఫార్సులకు ఈ సంప్రదింపుల్లో ఆమోదం లభించింది. ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా  లాంటి నిపుణుల సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, స్వచ్చంధ సేవా సంస్థలతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపింది. 

సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గర్భిణులకు టీకాలు వేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందించింది. టీకాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైద్య అధికారులు మరియు ఎఫ్‌ఎల్‌డబ్ల్యులకు కౌన్సెలింగ్ కిట్లను రూపొందించింది. 

వీటిని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గర్భిణులకు టీకాలు వేయడానికి సిద్ధం కావాలని సూచించింది. టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత గర్భిణులు గర్భధారణ సమయంలో తమకు సమీపంలో ఉన్న ప్రభుత్వ/ ప్రైవేటు టీకా కేంద్రాల్లో కో విన్ లో నమోదు చేసుకున్న తరువాత లేదా నేరుగా కూడా వెళ్లి టీకాలను తీసుకోవచ్చును. జాతీయ  టీకా కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు వర్తిస్తున్న నమోదు, టీకాలు వేసిన తరువాత ధృవీకరణ పత్రాల జారీ లాంటి అంశాల్లో అమలవుతున్న నిబంధనలు, విధానాలు గర్భిణులకు కూడా వర్తిస్తాయి.