Site icon TeluguMirchi.com

కోవిడ్ మరణాల సంఖ్య అపోహలపై స్పందించిన కేంద్రం

కోవిడ్ మరణాల సంఖ్యను మరింత ఎక్కువ చేసి చూపిస్తూ మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ వారి హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ( హెచ్ ఎమ్ ఐ ఎస్) సమాచారం మీద ఆధారపడి కోవిడ్ మరణాలుగా భావించటంలో అర్థం లేదు. సివిల్ రిజిస్ట్రీ సిస్టమ్ ( సి ఆర్ ఎస్) నుంచి, హెచ్ ఎం ఐ ఎస్ నుంచి తీసుకున్న దత్తాంశం ఆధారంగా లెక్కలుగట్టటం తప్పుడు అభిప్రాయానికి దారితీస్తుంది. అలాంటి వార్తా కథనాలు నిరాధారమైనవి, ఊహాజనితం.

హెచ్ ఎమ్ ఐ ఎస్ లో పేర్కొన్న మరణాలను ప్రస్తావిస్తూ, “ఎలాంటి ఇతర సమాచారమూ అందుబాటులో లేనందున ఈ మరణాలను కోవిడ్ మరణాలుగా భావించవలసి ఉంటుంది” అని ఆ వార్తల్లో  పేర్కొన్నారు. ఆ మీడియా వార్త ప్రకారమే గుర్తు తెలియని మరణాలు 2,50,000.  ఏ మరణాన్నైనా కోవిడ్ కే ఆపాదించటం తప్పు. అలాంటి ఊహాజనితమైన సమాచారం అందించటం అన్యాయం.

కోవిడ్ సమాచార పంపిణీలో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోంది. డేటా నిర్వహణకోసం ఒక అత్యాధునిక వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేలా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బాధ్యత అప్పగించారు.  మరణాల నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా  వాటి నమోదు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో భారత వైద్య పరిశోధనామండలి (ఐ సి ఎం ఆర్) మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలకు పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించి సిఫార్సు చేసిన ఐసిడి-10 నియమావళికి అనుగుణంగా అన్ని  మరణాలూ నమోదు చేస్తున్నారు.

నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ మరణాలు నమోదు చేయాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేకమార్లు లేఖల ద్వారా, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా , కేంద్ర బృందాలను పంపటం ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. జిల్లాలవారీగా ప్రతిరోజూ మరణాల నమోదును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తూనే ఉంది.  

కోవిడ్ లాంటి సుదీర్ఘమైన ఆరోగ్య సంక్షోభం ఉన్నప్పుడు మరణాల సంఖ్య విషయంలో కొంత తేడా ఉండటం సహజమే. అయితే, విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ఆధారంగా, పరిశోధనాత్మక అధ్యయనాల ద్వారా  సరైన సంఖ్యని నిర్థారించు కోవటం కూడా సహజమే. అందువలన కోవిడ్ మరణాల సంఖ్యలో తేడాలు వచ్చే అవకాశం లేదు.

Exit mobile version